నాడు ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు… నేడు ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు. పథకాలకు జగన్ తన పేరు పెట్టుకుని అహంకారాన్ని చాటుకోగా… ప్రజలకు సంక్షేమాన్ని అందించే సంక్షేమ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టి వారి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసిన చంద్రన్న ప్రభుత్వం. ఏపీ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు పథకాల పేర్ల మార్పు తతంగం తప్పేటట్లు లేదు. కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పథకాల పేర్ల మార్పు కార్యక్రమాన్ని ముందరేసుకుది. వృద్ధులకు పింఛన్లు అందజేసే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసా గా మార్చింది. ఇంకో రెండు పథకాల పేర్లను కూడా మార్చేసింది. 2019 కు ముందు వృద్ధాప్య పింఛన్ పథకం పేరు ఎన్టీఆర్ భరోసాగానే ఉండేది. 2019 ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్, ఈ పథకం పేరును వైఎస్ఆర్ పింఛన్ కానుకగా మార్చారు. ఇది ఒక్కటే కాదు, ఎన్టీఆర్ వైద్య సేవలను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గా మార్చారు. అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదట రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. చంద్రబాబు మొదలుపెట్టిన అన్న క్యాంటీన్లకు జగన్ రాజన్న క్యాంటిన్లు గా పేరు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే పథకాన్ని వైఎస్ఆర్ చేయూత పథకంగా మార్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటన్నింటి పథకాల పేర్లు మార్పు కి శ్రీకారం చుట్టారు.
గత వైసిపి ప్రభుత్వ హయంలో ప్రతి పథకం పేరు ను తన పేరుతో ఉండేలా అప్పటి సీఎం జగన్ పెట్టుకోవడంతో, అప్పట్లోనే టీడీపీ, జనసేన పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో , పూర్తిగా జగన్ పాలన ఆనవాళ్లను చెరిపి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి – తల్లికి వందనం, జగనన్న విద్యా కానుక – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్ద – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మన బడి నాడు నేడు – మన బడి మన భవిష్యత్తు, స్వేచ్ఛ – బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు – అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం గా పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు పేర్లను మార్చి గొప్ప వ్యక్తుల పేర్లను పెట్టినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు ప్రకటించిందని.. అందుకే సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఈ మేరకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించామని, దీనిలో భాగంగానే ముందుగా వైసీపీ ప్రభుత్వం లో అప్పటి సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లతో మార్చుతున్నట్లు లోకేష్ వెల్లడించారు.
గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటో రెండో కొత్త పథకాలు తీసుకువచ్చి, ఉన్నవాటిలో ఏదో ఓ పథకానికి పేరు మార్చేవి… దానికి కూడా ప్రతిపక్షాలు రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వచ్చేవి. కాని జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పేర్ల తతంగాన్ని పీక్స్ కు చేర్చారు. తన పేరుతో, తన తండ్రి పేరుతో దాదాపు 20 చిన్నా, పెద్దా పథకాలు పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పేర్లుగా మార్చారు. ఇక ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం విమర్శలకు దారితీసింది దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. అయినా దానిని జగన్ పట్టించుకోలేదు. ఈ పేర్ల మార్పిడిపై ప్రజాసంఘాలు మందపడుతున్నాయి. ఐదేళ్లకొకసారి ఈ మార్పులు ఏమిటి అని దుయ్యబడుతున్నారు. దీంతో ఈ సారి కూటమి ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. అసలు బ్రతికి ఉన్న నేతల పేర్లను పథకాలకు పెట్టకూడదని, ఆ పేర్లను తీసివేసి అమరులైన మహనీయుల పేర్లను పెట్టడంతో ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ