సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పవన్ ప్రకారం, అల్లు అర్జున్‌ను ఈ విషయంలో ఒక్కడినే బాధ్యుడిగా చూపించడం సరైంది కాదని, ఇది టీమ్ వర్క్‌గా చూస్తేనే తగిన పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
అల్లు అర్జున్‌పై పవన్ స్పందన:
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ విషయంలో అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబాన్ని ముందే పరామర్శించి ఉంటే వివాదం అంతగా ఉండేది కాదు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకూ తెచ్చారు. ఇది మానవతా దృక్పథం లోపించినట్లు అనిపిస్తోంది అన్నారు. అదేవిధంగా, చిత్ర యూనిట్ మొత్తం బాధ్యత వహించాలని, ప్రేక్షకుల ప్రేమను గౌరవించాలని సూచించారు. అల్లు అర్జున్ మీద ఒక్కడిపైనే నిందలు మోపడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో ఆయన మనసులో ఎంతో బాధ ఉండొచ్చు. బాధితుల కుటుంబానికి భరోసా ఇచ్చి ఉంటే వివాదం జరిగేదేం కాదు అన్నారు.
ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని, అర్జున్‌కు ముందుగానే పరిస్థితి గురించి తెలియజేసి ఉంటే ఇలాంటి పరిణామాలు నివారించవచ్చని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. “రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. పుష్ప 2 వంటి సినిమాలకు బెనిఫిట్ షో అనుమతులు, టికెట్ ధర పెంపు సహకారం అందించారు. ఆయన సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటారు,” అన్నారు.
సినీ పరిశ్రమలో మార్పు అవసరం:
పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలో మార్పు అవసరాన్ని గుర్తుచేశారు. “పాపికొండలు, విజయనగరం వంటి లొకేషన్లను ఉపయోగించుకోవాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్, స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేసి నూతన ప్రతిభను ప్రోత్సహించాలి,” అని చెప్పారు.
ఇదే సందర్భంలో, నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్‌ను కలుసుకుని రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా చర్చ జరిగింది.