నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’షో ప్రారంభమయింది. మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెస్ట్ గా వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘తిరిగొచ్చిన విజయం’ పేరుతో ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కాగా ఎపిసోడ్ లో పలు ఆశక్తికర అంశాల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాల గురించి వివరించారు.
అమరావతి కల గురించి బాలకృష్ణ ప్రశ్నించగా, చంద్రబాబు స్పందిస్తూ .. “అమరావతిని ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. సైబరాబాద్ నిర్మాణంలో సాధించలేనివి అమరావతిలో అమలు చేస్తూ, ప్రతి ఇంటికీ పైపుల ద్వారా ఏసీ సదుపాయం కల్పించే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ వాతావరణం, ప్రభుత్వ భూములు ఉన్నాయన్నది ఆ నగరానికి ప్రయోజనం కాగా, అమరావతికి కృష్ణా నది, కొండలు సహజసిద్ధం. ఈ రెండు నగరాలు దేశంలో నంబర్ 1, 2 స్థానాల్లో ఉండాలన్నది నా ఆశ” అని వివరించారు.
ఇక మీరు జైల్లో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ స్వయంగా జైలు కు వచ్చి కలిశారు..అప్పుడు ఏమాట్లాడారు..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎలా ఉన్నారు సార్..? రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం, ఒక విధంగా రాజకీయ వ్యూహం కేంద్రీకరించడం అనిపించింది. అందరితో కలిసి పోటీ చేద్దామని సలహా ఇవ్వడం, బీజేపీతో కలిసి పని చేయాలనే తత్వాన్ని తెలియజేసారు.
అప్పుడు నేనే ముందు అన్నాను. ఓ సారి ఆలోచించండి. అందరం కలిసి పోటీ చేద్దామని పవన్‌తో అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే అన్నాడు. బీజేపీకి కూడా నచ్చజెప్పి కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు అని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లి కూటమి ప్రకటన చేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. అదే తమ విజయానికి నాంది అని అన్నారు.
ఇక నారా లోకేశ్ జీవితం గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లోకేశ్ రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర ఓ కీలక మలుపు తీసుకొచ్చిందన్నారు. పాదయాత్ర చేయాలనే నిర్ణయం స్వయంగా లోకేశ్‌దే అని వెల్లడించారు. అయితే, విద్వేషపూరిత ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ పాదయాత్ర ఎలాంటి అవరోధాలను ఎదుర్కొనవచ్చోననే అనుమానం మొదట నాకు కలిగిందన్నారు. కానీ లోకేశ్ మాత్రం ధైర్యంగా పాదయాత్రను పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్లాడని తెలిపారు.
ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా, బాలయ్య అల్లుడిగా కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం, తన తాలూకు పోరాటస్ఫూర్తిని చాటుకోవాలనే సంకల్పంతోనే పాదయాత్ర మొదలుపెట్టాడు లోకేశ్. ప్రజల కోసం పోరాడతానని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ, తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్నాడుని తెలిపారు.