తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర సిట్ విచారణ ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి వార్తల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. గత టీటీడీ బోర్డు హయాంలోనే అన్నప్రసాదం, ప్రసాదంలో నాణ్యత లోపించిందన్న పవన్ కళ్యాణ్.. వారు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించి సంస్కరణలు తెస్తామన్నారు. అలాగే తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని మాత్రం వదిలిపెట్టమని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీబీఐ నుంచి ఇద్దరు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరో ఇద్దరు, FSSAI నుంచి ఒకరు.. మొత్తం ఐదుగురు సభ్యుల బృందతో సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
తిరుపతిలో లడ్డూ కల్తీ అంశంపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సిట్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ప్రసాదం అంశంపై చంద్రబాబు నాయుడు సర్కార్ సిట్ దర్యాప్తును నియమించింది. డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని 9 మంది సభ్యులతో సిట్ బృందాన్ని విచారణ నిమిత్తం ఆదేశించింది. ఆ బృందం దర్యాప్తు సైతం చేపట్టింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ సిట్ విచారణను నిలిపివేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దాదాపు రద్దు అయ్యే అవకాశం ఉంది.