ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. కాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఈనెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ జరగనుండగా పోటీలో దాదాపు పదిమంది వరకు అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయ గౌరీ యుటీఎఫ్ తరఫున పోటీకి దిగారు. ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పోటీ చేస్తున్నారు.
మరోవైపు పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు.కాకపోతే గత ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడుపై పాకలపాటి రఘువర్మ గెలిచారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరే బరిలో దిగుతుండటంతో..ఇద్దరి మధ్య గట్టిగానే పోటీ ఉండగా.. పీడీఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
ఏపీటీఎఫ్ తరుపున బరిలో దిగిన పాకలపాటి రఘువర్మకు టీడీపీ మద్దతు తెలిపింది . విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ.. రఘువర్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు. ఎంపీ శ్రీ భరత్ గీతం విద్యాసంస్థల అధినేతగా ఉండటం…. మరోవైపు ఉత్తరాంధ్రలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఎన్నికల్లో ఓట్లు ఉన్నాయి. దీంతో ఇది రఘు వర్మ కు కలిసి వచ్చేలా అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు గాదె శ్రీనివాసులనాయుడుకు బీజేపీ మద్దతు పలకడం విశేషం. కొద్దిరోజుల కిందట బీజేపీ ఉత్తరాంధ్ర నేత పీవీఎన్ మాధవ్ గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించారు. కాకపోతే అది వ్యక్తిగతమా? పార్టీ నిర్ణయమా? అన్నది ఇంకా బయటకు తెలియడం లేదు. కాగా ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తులే ఎన్నికవుతుండడం ఆనవాయితీగా వస్తుంది
2007లో శాసనమండలి పునరుద్ధరణ తరువాత గాదె శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2013లో కూడా ఆయనే రెండోసారి గెలిచారు. 2019లో మాత్రం పాకలపాటి రఘువర్మ చేతిలో ఓడిపోయారు. అయితే రఘు వర్మ కూడా విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తే కావడం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థులతో పాటు విజయ గౌరీ కూడా గట్టిపోటీ ఇస్తుండటంతో..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.