బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వరుసగా కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవిస్తోన్నాయి. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఉండబోతుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎండీ అలర్ట్ చేసింది. ఈ పరిస్థితుల్లో ఏపీలో నేడు కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు కోస్తా తీర ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడొచ్చు. అటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు లేకపోలేదు.
ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుదని, మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ సమయంలో చెట్ల కింద తలదాచుకోకూడదని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, రైతు కూలీలు ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు.
ఇక ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. కొన్ని రోజులపాటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం దీని తీవ్రత భారీగా తగ్గింది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు కోలుకున్నాయి. అదే సమయంలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరం సాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. అధికార యంత్రాంగం అక్కడే మకాం వేసింది. చిట్టచివరి వ్యక్తి వరకూ సహయక చర్యలు అందేలా చేస్తోంది.