భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతోంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల దాటికి విజయవాడ నగరం అతలాకుతలమైంది. చాలా కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజయవాడలో ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. యనమలకుదురులో కొండచరియలుపడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు కి గాయలయ్యాయి. ఘాట్రోడ్లో కొండ చరియలు విరిగిపడటంతో ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
నగరంలోని పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలలో భారీగా వరద పోటెత్తింది. మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్‌గ్రౌండ్ వంతెనల వద్ద దాదాపు ఐదు అడుగుల వరకు నీరు నిలిచింది. సాధారణంగానైతే ఇక్కడ వీఎంసీ మోటార్లు ఏర్పాటుచేసి వరద నీటిని ఎత్తిపోస్తారు. కానీ ఇంజిన్లు పాడయ్యాయని చెప్పి.. శనివారం రోజు వరద నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టలేదు. విజయవాడ బస్టాండు ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు ఏడు అడుగులు నిండిపోయింది. దీంతో బస్సుల రాకపోకలు నిలిచాయి.విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరం కూడా మొత్తం నీట మునిగింది. నగరంలో ఏ రోడ్డు చూసినా ఏది రోడ్డు, ఏది డ్రెయినేజీ తెలియని పరిస్థితిలో రెండు ఏకమై ఏరులా ప్రవహిస్తున్నాయి. నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడింది. పరిసర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. నూజివీడు-విస్సన్నపేట రహదారిలో కిలోమీటర్ మేర నీరు ప్రవహిస్తుంది. నూజివీడు బైపాస్ రోడ్డుపై కిలోమీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ముదినేపల్లి, జీలుగుమిల్లి, ముసునూరు, కొయ్యలగూడెం, మండవల్లి, కలిదిండిలు పూర్తిగా జలమయమయ్యాయి.