తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలు మితిమీరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో గాలికి కూడా వేడెక్కిపోవడంతో, బయట తిరగడం కష్టమవుతోంది. భయంకరమైన ఉక్కపోతతో అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాలో ఎండలు మరింత పెరుగుతుండగా, రాయలసీమలో మాత్రం వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది.
ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితి
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం కొనసాగనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యే అవకాశముంది. ప్రజలు ఎండ తీవ్రతను అంచనా వేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
ఇక్కడ కూడా వాతావరణం పొడిగా కొనసాగనుంది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆచితూచి బయటికి వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
రాయలసీమ
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, గురువారం నుంచి పొడి వాతావరణం ఉండొచ్చు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, మరింత వేడి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.