ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. అనంతరం మంత్రి విశ్వరూప్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, సభను సజావుగా జరగనివ్వాలని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కోపంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభనుంచి వెళ్లిపోయారు. మొదటి రోజు మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించగా, ఈ రోజు మరి కొన్ని బిల్లులు ఆమోదం పొందనున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
[subscribe]