3 రాజధానుల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

2020 AP Assembly Session, Andhra Pradesh Assembly News, Andhra Pradesh Assembly session, Andhra Pradesh Breaking News, Andhra Pradesh Latest News, AP 3 State capitals, AP Assembly Passes Bill Three Capitals, Ap Political News, AP Political Updates, Assembly Passes 3 Capitals Bill, Mango News

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైన అసెంబ్లీ రాత్రి 11 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ అనంతరం 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. రాజధానిని రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టగా, ఈ ప్రతిపాదనకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మూడు రాజధానుల అంశంపై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే సీఆర్‌డీఏ రద్దు బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందింది.

వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి రాజధాని అమరావతికి మద్దతుగా జై అమరావతి నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, వారిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని సీఎం వైఎస్ జగన్‌ స్పీకర్‌కు సూచించారు. అనంతరం 17 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. సస్పెండ్ అయినా వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన రాజప్ప, కరణం బలరాం, ఆదిరెడ్డి భవాని, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. మరోవైపు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో మూడు రాజధానుల బిల్లు శాసన మండలికి చేరింది. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి శాసన మండలిలో ఆధిక్యం ఉండడంతో ఈ బిల్లును తిప్పికొట్టేందుకు సిద్దమవుతుంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =