ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లింది వైసీపీ. తీరా ఫలితాలు వచ్చే సరికి 11 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అటు 25కు 25 ఎంపీ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. చివరికి 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఎంపీలు గెలుపొందారు. అటు కేంద్రంలో 292 సీట్లను దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం సంచలనంగా మారింది.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలుపొందింది. అలాగే మిత్రపక్షాలతో కలుపుకొని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 234 సీట్లు దక్కాయి. మెజారిటీకి 38 సీట్ల దూరంలో ఉంది ఇండియా కూటమి. ఈక్రమంలో ఏ కూటమిలోనూ చేరకుండా నిలిచిన పార్టీలను.. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని పోయేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టింది. మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించి.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన 37 మంది ఎంపీలను కూడబెట్టుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కడప నుంచి మరోసారి వైఎస్ అవినాశ్ రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, అరకు నుంచి తనూజా రాణి, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గెలుపొందారు. ఆ నలుగురి బలం కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్కు మరింత దగ్గరవ్వొచ్చనే ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీ ఫోన్ చేశారట. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారట. కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY