ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. నిరుపేదలు పండుగ పూటా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేశారు. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసేసి కేవలం బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెలా బియ్యంతోపాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నా.. వీటిలో 90 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తోంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కనా ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, రూ. 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు.