ఏపీలో ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే కీలకమైన రెండు హామీలు అమలుచేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది. సామాజిక పింఛన్లు కూడా పెంచి అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. ఇప్పుడు కీలకమైన మరో రెండు హామీలు అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం. దసరా, దీపావళి కానుగా మరో రెండు కానుకలు అందజేయాలని భావిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటీ 55 లక్షలకుపైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తే.. ఏడాదికి రూ.3,640 కోట్లు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అధికారులు లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారమే ఈ లెక్కలు వేశారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే ఆ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ 1.55 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లలో.. రాష్ట్ర ప్రభుత్వం పథకమైన దీపం, కేంద్ర పథకమైన ఉజ్వల పథకంతో పాటుగా ఇతర పథకాల కింద 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వీరికి మాత్రమే పరిమితం చేస్తే.. ఏడాదికి రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుంది.
ఏపీలో 1999 నుంచి దీపం పథకం అమల్లో ఉంది. వీటిని ఉజ్వల పథకం కింద పరిగణనలోకి తీసుకుని రూ.300 చొప్పున రాయితీ ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీన్ని కేంద్రం ఆమోదిస్తే దీపం, ఇతర పథకాల ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల కిందకు వస్తాయి. దీంతో ఏపీపై ఏడాదికి రూ.585 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లకు రూ.2925 కోట్ల మేర ప్రయోజనం కలుగనుంది.
దసరా నుంచి ఉచిత బస్సు పథకం.!
కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన హామీల్లో ఒకటి ఉచిత బస్ ప్రయాణం. ఏపీఎస్‌ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీని దసరా నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేసింది. మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఎలా అమలుచేయాలని ఏ ఏ బస్‌లో ఈ స్కీమ్ ప్రవేశ పెట్టాలనేది ఇప్పటికే డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. అయ్యే ఖర్చు ఎంత లాంటి సమగ్ర వివరాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.