‘లంకె బిందెలు ఉన్నాయంటే.. ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి..’ అంటూ అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట ఇది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు అపసోపాలు పడుతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడమే అందుకు కారణం. ఎన్నికల సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖజానా ఖాళీ అనే మాట వినిపిస్తోంది. సీఎం జగన్ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఖజానా ఖాళీ అయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతున్నారు. అప్పు తీసుకోకపోతే పూటగడవని స్థితికి ప్రభుత్వం చేరుకుందని స్వయాన ఆయన నోటే పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేక ప్రభుత్వం అపసోపాలు పడుతోందని చెబుతున్నారు. జగన్ ఈ ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్ల అప్పు చేశాడని, వాటిని ఆయన రోత పత్రిక తీరుస్తుందా.. భారతీ సిమెంట్స్ తీరుస్తుందా అంటూ నిలదీస్తున్నారు. ఈ సీఎం నమ్మించి గొంతు కోసే రకమని దుయ్యబడుతున్నారు. అలాంటి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని, మరింత ప్రయోజనాలు కలిగిస్తామని హామీ ఇస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా వైసీపీకి మించిన హామీలు ఉన్నాయి. ఖజానా ఖాళీ ఉంది అంటున్న చంద్రబాబు.. జగన్ కు మించి సంక్షేమ పథకాలను అందిస్తామని ఎలా చెబున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కన్నా తెలంగాణలో తలసరి ఆదాయం 35 శాతం అధికంగా ఉంటే 2014-19లో దానిని 27 శాతానికి తగ్గేలా చేశామని.. జగన్ వచ్చాక తేడా 45 శాతానికి పెరిగిందని.. బటన్ నొక్కి పేదల సంక్షేమం చేస్తే ఇంత వ్యత్యాసం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి మితిమీరిన హామీలు ఇవ్వడం.. ఒకవేళ అధికారంలోకి వస్తే.. వాటిని అమలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతుండడం పక్క రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. అయినా ఇచ్చిన మాటకు నిలబడతామని చెబుతుండడం వింటున్నాం. ఒకవేళ ప్రభుత్వం మారితే.. రేపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఒక్క ఓటు వేసినా మన నెత్తిన మనమే చెత్తవేసుకున్నట్లు అవుతుంది. బటన్ నొక్కి ప్రజల సంక్షేమమని ప్రతిరోజూ చెబుతున్నాడని.. అలాగైతే మద్య నిషేధం, జాబ్ కేలెండర్, డీఎస్సీలపై ఎందుకు నొక్కలేదు’అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. ఒకవేళ అధికారంలోకి వస్తే.. ఏం నొక్కి సంక్షేమాన్ని కొనసాగిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 లాగేసుకుంటున్నాడు. బటన్ నొక్కి ఇచ్చింది ఎంత? ప్రజల నుంచి నొక్కింది ఎంత? అందులో మీరు బొక్కింది ఎంత’ అని ప్రస్తుతం జగన్ ను నిలదీస్తున్న చంద్రబాబు.. రేపొద్దున ప్రజలపై ఎటువంటి భారాలూ వేయకుండా ప్రస్తుత సంక్షేమ పథకాలు సహా.. అదనంగా మరిన్ని అమలు చేస్తామని ఎలా ప్రకటిస్తున్నారో సమాధానం చెప్పాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY