ఎన్నికల షెడ్యూల్ కు, ఎన్నికలకు మధ్య ఉన్న భారీ సమయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలతో కూటమి నేతలు బిజీగా ఉన్నప్పటి నుంచే సిద్ధం పేరుతో జగన్ జనం బాట పట్టారు. సిద్ధం సభల ద్వారా రాష్ట్రమంతా ఒక మారు చుట్టేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. ఆ వెంటనే మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల నోటిఫికేషన్ వరకూ నడిపించేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో బస్సు యాత్రకు ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు .. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కూటమి పేరుతో ఒక్కటైన నేతలు అందరూ జగన్ ను టార్గెట్ చేస్తూ.. తలోవైపు ప్రచారం చేస్తుండగా.., ఒక్కడే అయినప్పటికీ జగన్ కూడా వారికి కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అభ్యర్థులు అనకుండా.., ఇన్‌చార్జిల పేరుతో నేతలను అందరి కంటే ముందుగా రంగంలోకి దింపి ప్రచారంలో వినూత్న పంథా అవలంబించారు. మరోవైపు.. సిద్ధం సభలతో.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ జనాల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచేలా కసరత్తు చేస్తున్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానని, డబుల్ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు సిద్ధమా..? అంటూ ప్రజలను ఉత్సాహపరిచేలా ప్రసంగాలు సాగిస్తున్నారు. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామన్న జగన్.. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయన్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే అంటూ విపక్షాలపై కౌంటర్లు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ప్రచారంలో భాగంగా అన్ని వర్గాలనూ కలిసేలా జగన్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచించారు. మరోసారి అధికారమే లక్ష్యంగా ఎన్నికల క్షేత్రంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ తిరుగుతోంది. తాజాగా మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపంలో ప్రచారం చేసిన జగన్.. అక్కడ లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సమావేశం అయ్యారు. సభలు, సమావేశాలే కాకుండా.., ప్రజలతో భేటీలు కూడా ఉండేలా ప్రచార షెడ్యూల్ ను రూపొందించుకున్నారు. ఎన్నికల వరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల మధ్యే ఉండేలా జగన్ ముందుకు సాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY