విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్, విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు.
గ్యాస్ లీకేజీ సంఘటనపై పూర్తీ సమాచారాన్నిసేకరించి, సమగ్ర నివేదికను రూపొందించేందుకు హైపవర్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించనున్నారు. ఈ ఘటనపై వివిధ కమిటీల నివేదికలు సహా పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవడం, సంబంధిత ప్రజల వినతులు పరిశీలించడం చేయనున్నారు. అందులో భాగంగా మూడు రోజులపాటు వివిధ వర్గాలతో హైపవర్ కమిటీ భేటీలు నిర్వహించి సమాచారాన్ని సేకరించనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu







































