
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఇటీవల ముగిసింది. ఎన్నికల రణం ముగిసినా.. ఏపీలోని పలు ప్రాంతాలు రాజకీయ రణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఒకవైపు ఇలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, మరోవైపు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. గతంలో మాదరిగా ఏపీ ఓటర్లు ఈసారి ఒకవైపు లేరన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచీ బీఆర్ ఎస్ కొంత కాలం స్తబ్దుగా ఉంది. దీనికితోడు.. పలువురు కీలక నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి జంప్ చేయడంతో ఇక బీఆర్ ఎస్ ఖాళీ అనే ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటి తెలంగాణలో బీఆర్ ఎస్ కు ఎదురులేదని నిరూపించాలని ఆ పార్టీ అగ్రనేతలు భావించారు. ఈమేరకు బస్సు యాత్ర పేరుతో గులాబీ బాస్ కేసీఆర్, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పోలింగ్ ముగియడంతో తమకెన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకోవడమే కాదు.. ఒక అంచనాకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నామని దీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందని అన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్‌ను చూసి కాంగ్రెస్ , బీజేపీ భయపడ్డాయని కేటీఆర్ అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని అన్నారు.
పనిలో పనిగా.. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తున్నాడని సమాచారం ఉందని అన్నారు. కేటీఆర్ అభిప్రాయంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆయన పార్టీ పరిస్థితి గురించి ఆలోచిస్తే.. బెటర్ అని, పక్క రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో తర్వాత సంగతి అని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్‌ను బట్టి టీడీపీ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ అంతా కూటమి గెలుస్తుందని మాట్లాడుకుంటుంటే.. తెలంగాణలో ఉన్న కేటీఆర్ కు జగన్ గెలుస్తాడని సమాచారం రావడం విడ్డూరమని పలువురు విమర్శిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY