ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి ‘బొమ్మ’ హిట్ట‌వుద్దో..! సినిమా ప్ర‌మోష‌న్ల‌లో నాయ‌కులు

AP Elections, YCP, TDP, Jagan, Chandrababu naidu, Yatra2, rajadhani files,Political films hit AP election,Y.S. Jagan Mohan Reddy,YSRCP,Lok Sabha elections 2024, AP Latest news and Updates, AP Politics, Mango News Telugu,Mango News
AP Elections, YCP, TDP, Jagan, Chandrababu naidu, Yatra2, rajadhani files

ఏదో సినిమాలో చెప్పిన‌ట్టు.. స‌మాజంపై సినిమా ప్ర‌భావం బాగానే ఉంది. సినిమా అనేది సామాన్యుడి వినోదం. పేద‌, గొప్ప అనే తేడా లేకుండా.. సినిమాల‌పై అంద‌రికీ ఆస‌క్తి ఉంటుంది. అర‌చేతిలో ప్ర‌పంచం ఉన్నా.. వీకెండ్ వ‌స్తే.. యువ‌త సినిమా హాల్లోనే ఉంటోంది. బొమ్మ జ‌నాల‌కు న‌చ్చితే.. బ్లాక్‌బ‌స్ట‌రే. నిర్మాత‌కు కాసులపంటే. అందుకే రాజ‌కీయ పార్టీలు కూడా ఎన్నిక‌ల‌కు ముందు సినిమాల‌నే న‌మ్ముకుంటున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈసారి ఇది కాస్త ఎక్కువ‌గా ఉంది. నాయ‌కుల ప్ర‌చారంలోనూ సినిమా డైలాగుల ద్వారానే ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ న‌టుడి సినిమా పాట‌లో వినియోగించిన కుర్చీ మ‌డ‌త‌పెట్టి అనే డైలాగు ఏపీ అధికార, విప‌క్ష పార్టీల మ‌ధ్య రోజూ వినిపిస్తూనే ఉంది.

సినిమా పేర్లు, అందులోని డైలాగులు చెప్పే రాజ‌కీయపార్టీ నాయ‌కులు ఒక‌రికొక‌రు వార్నింగ్ లు, ప్ర‌జ‌ల‌కు సందేశాలు ఇస్తున్నారు. ‘జగన్‌రెడ్డీ నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది… కాస్కో..!‘ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవ‌ల ముఖ్య‌మంత్రిని హెచ్చరించారు. ఇందుకు కార‌ణం ‘రాజధాని ఫైల్స్‌‘ సినిమా ప్రదర్శనకు హైకోర్టు అనుమతి ఇవ్వ‌డ‌మే. అంతేకాదు.. విప‌క్ష నాయ‌కుడు ఆ సినిమా ప్ర‌చారాన్ని కూడా భుజాన‌కెత్తుకున్నారు. చంద్ర‌బాబు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ తెలుగు ప్రజలంతా ఆ సినిమా చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ‘ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి.. అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చరిత్రాత్మక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేశాడు. విష ప్రచారాలు చేయించాడు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’. జగన్‌ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని… దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టింది ఈ చిత్రం. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్‌ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కోర్టు ఆ ఆటలను సాగనివ్వలేదు’ అని చంద్రబాబు  ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

చంద్ర‌బాబే కాదు.. టీడీపీ నేత‌లు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంతో పాటు, సినిమా ప్ర‌మోష‌న్ పై దృష్టి పెట్టారు. రాష్ట్ర హితం కోరే వారంతా ‘రాజధాని ఫైల్స్‌’ సినిమాను చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌క‌ట‌న ఇస్తున్నారు. ఆయ‌న సినిమా చూసిన అనంత‌రం.. మాట్లాడుతూ ‘రాజధాని ఫైల్స్‌ సినిమా చూసి ఇప్పుడే ఇంటికి వచ్చా. గొప్ప సందేశాత్మక చిత్రమిది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న యదార్థ సంఘటనల్ని, అమరావతి కోసం 1,500 రోజులకుపైగా అలుపెరగని పోరాటాన్ని చేస్తున్న ఉద్యమ నేపథ్యాన్ని కేవలం 150 నిమిషాల వ్యవధిలో సహజ సిద్ధంగా చిత్రీకరించడం నిజంగా అభినందనీయం’ అని అచ్చెన్న తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు యాత్ర సినిమా గురించి వైసీపీ నేత‌లు ఇదే త‌ర‌హా ప్ర‌చారం చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఆ చిత్రం 2019లో వైసీపీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈనేప‌థ్యంలోనే ఈ ఎన్నిక‌ల ముందు వ‌చ్చేలా యాత్ర 2 ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. మ‌రోవైపు రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం సినిమా కూడా రాజ‌కీయ ఇతివృత్త‌మే. అలాగే.. రాజకీయ ఇతివృత్తంగానే పుస్త‌క ప్ర‌చుర‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. దీనిపై సోష‌ల్‌మీడియాలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగుదేశం వాదన బలపరుస్తూ, చంద్ర‌బాబునాయుడిని కీర్తిస్తూ ఈసారి ఏకంగా డజను వరకూ పుస్తకాలు తెచ్చారు.. కానీ సినిమా ఒకటే వచ్చింది.. వైసీపీ వాళ్ళు ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు… అని సామాజిక‌మాధ్య‌మాల్లోనూ ప‌లువురు త‌మ వాల్ పై పెడుతున్నారు. ఈక్ర‌మంలో ఎన్నిక‌ల్లో ఎవ‌రి బొమ్మ హిట్ట‌వుద్దో అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ