నందమూరి,నారా,దగ్గుబాటి ఈ మూడు కుటుంబాలు ఇప్పుడు ఏకమయ్యాయి. ఇప్పుడు మూడు కుటుంబాలకు పెద్ద దిక్కు సీఎం చంద్రబాబే. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని విమర్శలు ఉండేవి. అయితే మెల్లమెల్లగా ఆ విమర్శలన్నీ దూరం అయిపోతున్నాయి. ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మార్చి 6న జరిగిన ఓ కార్యక్రమంలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో ఇటు నారా వారి కుటుంబం అటు దగ్గుబాటి వారి కుటుంబంతో పాటు తెలుగు తమ్ముళ్లంతా తెగ ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలయితే ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ తోడల్లుళ్లు కలిసారంటూ సంతోషడిపోయారు. ఎందుకంటే తెలుగు నాట ఈ ఇద్దరు తోడల్లుళ్లు మధ్య జరిగిన పొలిటికల్ ఫైట్ అందరికీ తెలిసిందే. చంద్రబాబును రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ విభేదించే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు తానుగా మళ్లీ దగ్గరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసే ఉండేవారు. చంద్రబాబు సీఎంగా, వెంకటేశ్వరరావు మంత్రిగా ఉండేవారు.అయితే ఓ కార్యక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వెంకటేశ్వరరావు.. చంద్రబాబు పేరెత్తితేనే మండిపడే వారు. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే చంద్రబాబును ఆశ్రయించారు. తమ మధ్య గ్యాప్ ఉండేదని .. కానీ కుటుంబం అంటే కలిసిపోవాలి కదా అని అర్థం వచ్చేలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఉన్నగ్యాప్ దూరం అయిందని అంతా సంతోషిస్తున్నారు.
ఇక దగ్గుబాటి పురందేశ్వరి అయితే తన చెల్లెలి భర్త విషయంలో అప్పటికీ, ఇప్పటికీ గౌరవంగానే ఉంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబును నమ్మిన నందమూరి కుటుంబం ఆది నుంచి గౌరవ భావంతోనే ఉంది. టీడీపీలో సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పనిని వెన్నుపోటు అన్నా అసలు నిజం తెలిసిన నందమూరి ఫ్యామిలీ మాత్రం చంద్రబాబును ఎప్పుడూ దూరం పెట్టలేదు. ఆ సమయంలో ఉమ్మడి ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు బాబుపై నమ్మకం పెట్టుకున్నారు. నందమూరి హరికృష్ణ బతికున్నంత వరకు బావ చంద్రబాబుతోనే కొనసాగారు. మధ్యలో టీడీపీతో విభేదించి వెళ్లిపోయిన హరికృష్ణను చంద్రబాబు చేరదీసి రాజ్యసభ పదవి ఇచ్చారు. అలాగే బాలకృష్ణ ద్వారా నందమూరి కుటుంబం, తన కుటుంబం ఒకటే అనే సంకేతాలిచ్చారు. కాగా ఇప్పుడు దశాబ్దాలుగా వైరంతో ఉన్న తోడల్లుడు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా తన చేతలతో చేరదీయగలిగారు.
ఇదే సమయంలో జగన్ తెరమీదకు వస్తున్నారు. రక్త సంబంధం లేకపోయినా సీఎం చంద్రబాబు కుటుంబాలకు ఇచ్చిన ప్రాధాన్యత .. రక్తం పంచుకుపుట్టినవారిపై కూడా జగన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించిన సోదరి షర్మిల.. ముందుగా వ్యక్తిగతంగా సోదరుడికి దూరమయ్యి..ఆ తరువాత రాజకీయంగానూ రూటు మార్చారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కూడా కొడుకు జగన్ కంటే కుమార్తెకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు. తన తండ్రి హత్య విషయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటూ నిందిస్తున్నారు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత ఎప్పుడూ సీఎం చంద్రబాబుకు వర్తిస్తూనే ఉంటుంది. కుటుంబంలో ఐక్యత లేకుండా ప్రజలను పాలిస్తానంటూ ఎవరూ నమ్మరు . అందుకే జగన్ మోహన్ రెడ్డిని నమ్మని ఏపీ ప్రజలు.. చంద్రబాబును సీఎం చేశారన్న వాదన వినిపిస్తుంది.