సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికాలో బిలీనియర్ అదానీపై అభియోగాలు నమోదు చేయడం, అందులో పెద్ద ఎత్తున ముడుపులు ఏపీలో 2021లో అధికారంలో ఉన్న వారికి దక్కాయనే ఆరోపణలు రావడంపై స్పందించిన వైసీపీ..తాము సెకీతోనే ఒప్పందం చేసుకున్నట్లు చెబుతోంది.
అదానీ గ్రూప్‌తో తమ ప్రభుత్వానికి అసలు ప్రత్యక్ష ఒప్పందమే లేదని, 2021లో కుదిరిన విద్యుత్ విక్రయ ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , ఏపీ డిస్కంల మధ్యే జరిగిందని వైసీపీ అంటోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై.. అదానీ గ్రూప్ పై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపడంతో ..వైసీపీ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
2021 నవంబర్‌లో 7వేల మెగావాట్ల విద్యుత్ సేకరణకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు.. ఆ తర్వాత ఎస్ఈసీఐ, ఏపీ డిస్కమ్‌ల మధ్య 2021 డిసెంబర్ 1న పవర్ సేల్ అగ్రిమెంట్ కుదిరిందని తెలిపింది. ఖరీదైన సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కొంతమంది అధికారులకు లంచాలు ఇచ్చినట్లు గౌతమ్ అదానీ, అదానీ మేనల్లుడు సాగర్ సహా మరో ఏడుగురిపై అమెరికా న్యాయ శాఖ తాజాగా అభియోగాలు మోపింది.
2021, 2022 సంవత్సరాల్లో అదానీ ప్రభుత్వ అధికారులను వ్యక్తిగతంగా కలుసుకుని ఎస్ఈసీఐతో ఎలక్ట్రిసిటీ విక్రయ ఒప్పందాలపై సంతకాలు చేయడానికి లంచాలు ఇచ్చినట్లు యూఎస్ అటార్నీ ఆఫీసు తెలిపింది.ఆ చర్చ జరిగిన సమయంలో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం అని కాకుండా..సెకీగా పిలిచే ఎస్ఈసీఐ భారత ప్రభుత్వ సంస్థ అని పేర్కొనాల్సిన అవసరం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ డిస్కంలకు, అదానీ గ్రూపునకు చెందిన కంపెనీలతో సహా మరే ఇతర కంపెనీల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని వైసీపీ గుర్తు చేస్తోంది.
ఎస్ఈసీఐతో పీపీఏకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా అప్పట్లో ఆమోదం తెలిపిందని చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే 3వేల మెగావాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే 3వేల మెగావాట్లు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ సిస్టంతో 25 ఏళ్ల కాలానికి కిలోవాట్‌కు రూ.2.49 చొప్పున 7వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎస్ఈసీఐ నుంచి కొనుగోలు చేయడానికి తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది.