97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. ఇక పోటీలో నిలిచిన వాటిలో ఆరు భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. తమిళ చిత్రం కంగువాతోపాటు హిందీ చిత్రాలు ది గోట్ లైఫ్ , సంతోష్ , స్వాతంత్ర్య వీర్ సావర్కర్ , మలయాళ సినిమా ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ , మరో మూవీ గర్ల్స్ విల్ బి గర్ల్స్ భారత్ నుంచి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి.
అయితే ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న విషయం 2024లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన కంగువా సినిమా ఆస్కార్స్ బరిలో నిలవడం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని యునానిమస్ గా రిజెక్ట్ చేశారు. అయినా భారత్ నుండి ఆస్కార్ బరిలో నిలిచి షార్ట్ లిస్ట్ అయ్యింది. వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్ తయారు చేసిన కంగువ దర్శకుడు శివ ..వెండి తెరపై నిరాశపరిచాడు.
ఆస్కార్స్ 2024 బెస్ట్ పిక్చర్ కోసం మొత్తం 323 సినిమాలు పోటీపడగా ఎలిజిబుల్ లిస్ట్ లో కంగువ చోటు దక్కించుకుంది. ఇక ఈ సినిమా కథనం స్లోగా ఉన్నా.. సినిమాలోని అటవీ ప్రపంచం, అందులో నివసించే తెగ నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్ ని పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నటనపరంగా సూర్యకు నూటికి నూరు మార్కులు పడినప్పటికీ కంగువ సినిమా కథ, కథనం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ వల్ల కంగువ సినిమా ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచి ఉండొచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఆస్కార్ అవార్డ్ గెలవడం మాత్రమే కాదు ఆస్కార్ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే.
ఇక నామినేషన్ల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్లను జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.