ముంబైలో సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా భావిస్తున్న మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్‌కు సహకరించిన మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో చప్రాలో గాలింపు చర్యలు చేపట్టి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అనుమానాల ప్రకారం, షహజాద్ వినియోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుమీద ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం ఆమెను ముంబైకి తరలించి విచారణ చేపట్టనున్నారు.
జనవరి 16న ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన షహజాద్, సైఫ్‌పై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు. కుటుంబసభ్యులు వెంటనే సైఫ్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు, అక్కడ వెన్నెముక శస్త్రచికిత్స చేసి జనవరి 21న డిశ్చార్జ్ చేశారు.
ఈ కేసులో శాస్త్రీయ పరిశోధన కీలకమవుతోంది. షహజాద్ వేలిముద్రలు ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలకు సరిపోలడం లేదని ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. దీంతో కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనా ప్రదేశంలో 19 వేలిముద్రల నమూనాలను క్రైమ్ బ్రాంచ్ సేకరించినా, ఒక్కదానితోనూ షహజాద్ ముద్రలు సరిపోలలేదు.
అయితే షహజాద్ తండ్రి ఈ దాడి ఘటనలో తన కుమారుడు ఆచరణలో భాగమనే ఆరోపణలను ఖండించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి అతని కుమారుడు కాదని, అతని శరీరాకృతి, హెయిర్ స్టైల్ వేరుగా ఉన్నాయని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఈ వాదనకు మద్దతు ఇచ్చింది.
ఈ కేసు రాజకీయ మలుపులు కూడా తీసుకుంటోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి, పోలీసుల దర్యాప్తు, ఆరోపణలు అన్నీ కలగలిపి సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. నెటిజన్లు ఈ కేసు సినిమాకథను మించేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.