దేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ లో శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభయింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ముందుగానే సిద్ధం చేశారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ ప్రారంభం కాగానే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ఎంపీలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచే ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులు మరియు 543 మంది లోక్సభ సభ్యులతో ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది ఉన్నారు. ఎలెక్టర్లందరూ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు కాబట్టి, ప్రతి పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఒకే విధంగా 1 గా ఉంటుందని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో పార్టీకి చెందిన 35 మంది సభ్యులు మినహా మిగిలిన వారంతా ఓటింగ్లో పాల్గొననున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే, శనివారం సాయంత్రమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. రాత్రికల్లా దేశ నూతన ఉపరాష్ట్రపతి ఎవరనేది ఫలితం వెలువడనుంది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా తదుపరి దేశ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నిక కావడానికే అవకాశం ఉంది. అధికార బీజేపీ కూటమికే లోక్సభలో 303, రాజ్యసభలో 91 కలిపి 394 ఓట్లున్నాయి. వీటితో పాటుగా ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, ఏపీలోని వైఎస్సార్సీపీ, టీడీపీ, మహారాష్ట్రలోని శివసేన, తమిళనాడులోని అన్నాడీఎంకే, పంజాబ్ లోని ఎస్ఏడీ, యూపీలోని బీఎస్పీ మరియు ఆర్ఎల్జేపీ, ఏజీపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ పాటుగా పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపడంతో జగదీప్ ధన్కర్ గెలుపు లాంఛనమే కానుంది. ఇక మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































