అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారులను వారివారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారిని గుర్తిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తుంది. మెక్సికో తర్వాత అమెరికాలో ఎక్కువగా ఉంటున్నది భారతీయులే. వీరిలో 18 వేల మంది అక్రమంగా ఉంటున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
ఇప్పటికే వేల మందిని అమెరికా దాటించగా.. భారతదేశానికి కూడా ఇటీవల 105 మందితో ఓ ఫ్లైట్ వచ్చింది. తాజాగా మరో రెండు విమానాలు రాబోతున్నాయి. అందులో తొలి ఫ్లైట్ సీ17 గ్లోబ్ మాస్టర్–3 119 మందితో ఫిబ్రవరి 15న భారత్‌లో ల్యాండ్ కాబోతోంది. రాత్రి 10 గంటలకు ఈ విమానం అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక రెండో ఫ్లైట్ ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉండగా.. ఈ విమానంలో ఎంతమంది వస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు.
ఈరోజు ల్యాండ్ అయ్యే ఫ్లైట‌్‌లో సీ17 గ్లోబ్ మాస్టర్–3లో 119 మంది భారతదేశానికి చెందిన వలసదారులున్నారు. వీరిలో 67 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా… హర్యానాకు చెందినవారు 33 మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు, గోవాకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందినవారు ఇద్దరు, రాజస్తాన్ కు చెందినవారు ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు ఒకరు, జమ్మూ కశ్మీర్ కు చెందినవారు ఒకరు ఉన్నట్లు గుర్తించారు. వారం రోజుల క్రితం 105 మందితో వచ్చిన ప్లైట్‌ను అమృత్‌సర్‌లో లాండ్ చేయించారు. అయితే ఇప్పుడు రాబోతున్న విమానం కూడా అక్కడే ల్యాండ్ కాబోతోంది.