2030 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమివ్వబోయే మొరాకో దేశం, భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కోసం దేశం మొత్తం మీద 30 లక్షల వీధికుక్కలను చంపేందుకు మొరాకో ప్రభుత్వం రెడీ అవుతోందట. ఇప్పటికే వీధి కుక్కలను చంపే ప్రక్రియ ప్రారంభమవడంతో, జంతు ప్రేమికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో వీధికుక్కలను అంతమొందించడానికి వివిధ పద్ధతులను ప్రయోగిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కుక్కలతో ప్రపంచ కప్ నిర్వహణకు సమస్యలేమీ ఉండవని, వాటిని బంధించి ఇతర ప్రాంతాల్లో విడిచిపెట్టడం మంచి పరిష్కారమని మొరాకో ప్రజలు సూచిస్తున్నారు. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం విషపదార్థాలు ఇవ్వడం, కాల్చడం, ఇనుప రాడ్లతో కొట్టడం వంటి దారుణ పద్ధతుల్లో వీధికుక్కలను హతమారుస్తోంది. ఇది జంతు హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, మానవత్వానికి చేటు అని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ చర్యలను అడ్డుకోవాలని జంతు సంరక్షకుడు జేన్ గూడాల్ ఫిఫాకు బహిరంగ లేఖ రాశారు. ప్రపంచ కప్ నిర్వహణకు మొరాకోకు ఇచ్చిన హక్కును తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో కుక్కల మరణాలపై ఫిఫా తన విచారణను ప్రారంభించినట్లు సమాచారం. మొరాకోలో జంతు జనాభా నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సరిగా అమలు కాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచ కప్ కోసం ఈ దారుణ చర్యలు కొనసాగుతాయా? లేదా జంతు హక్కుల కోసం ఫిఫా లేదా అంతర్జాతీయ సంఘాలు రంగంలోకి దిగుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.