టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్వర్గీయ ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామ్యపక్షంగా ఉండటంతో.. ఈసారి ఎన్టీఆర్‌కు భారతరత్న దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు కూడా భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.
దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారత రత్న కోసం కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడే కాదు.. చాలా ఏళ్లుగా వినిపిస్తూ వస్తోంది . ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు భారత రత్న సాధిస్తామని చెప్పారు. దీంతో ఎన్డీయే సర్కారులో టీడీపీ కీలక భాగస్వామి కావడంతోనే చంద్రబాబు ఆ మాట అన్నారని.. ఎన్టీఆర్‌కు ఈ సారి భారత రత్న కచ్చితంగా దక్కుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి .
ఇలాంటి సమయంలోనే భారత రత్న పురస్కారం కోసం మరికొందరు పేర్లు తెరమీదకు రావడం హాట్ టాపిక్ అయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు భారతరత్న ఇవ్వాలంటూ.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా డిమాండ్ చేశారు. బుధవారం తన సొంత నియోజకవర్గం అయిన బెగుసరాయ్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా బిహార్ రాష్ట్రాభివృద్ధి కోసం నితీష్ కుమార్ ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. గతంలో బీహార్‌ను జంగిల్ రాజ్ అని పిలిచేవారని కానీ ఆ పరిస్థితిని నితీష్ పూర్తిగా మార్చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో.. ఎన్డీయే మరోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని గిరిరాజ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు.అంతేకాకుండా.. ఒడిశా మాజీ సీఎం, బీజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఎన్నో ఏళ్లుగా ఒడిశా అభివృద్ధి కోసం పాటు పడ్డారని గిరిరాజ్ సింగ్ కొనియాడారు. వారిద్దరికీ కేంద్రప్రభుత్వం.. భారతరత్న పురస్కారంతో సముచితంగా గౌరవించాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాజాగా భారత రత్న పురస్కారానికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలయ్యింది.
2025 నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జేడీయు అధినేత నితీశ్ కుమార్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలంటూ స్వయంగా ఓ కేంద్ర మంత్రి ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిహార్ రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.