గిరిజన మహిళలకు పెద్దగా లోక జ్ఞానం తెలియదు. ఎందుకంటే వాళ్లకు పెద్దగా చదువు ఉండదు. భర్త సంపాదిస్తుంటే వండిపెడుతూ, ఇంటి పనులు చేసుకుంటూ పిల్లలను సాకడమే పెద్ద పనిగా భావిస్తూ ఉంటారు. కాలం మారుతున్నా.. టెక్నాలజీ మారుతున్నా.. ఇందులో మార్పు ఉండటం లేదు. కానీ దీనిని తిరగరాస్తున్నారు బీహార్‌లోని కొంతమంది మహిళలు.
బీహార్‌లో ఉన్న గిరిజన మహిళలు అరకొర చదువులు తప్ప పెద్ద చదువులు చదవలేదు. అయినా కూడా స్వయం ఉపాధి పొందుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటికి ఆసరాగా ఉండాల్సిన కుటుంబ యజమాని.. కుటుంబ పోషణ కోసం దేశం కాని దేశానికి వెళ్లి కూలీలుగా పనిచేస్తుంటేనే పూట గడిచే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఇంటి వద్ద ఉన్న మహిళలు సొంతగా వ్యాపారాలు చేస్తూ.. ఉపాధి సంపాదించుకుని అందరిలో గుర్తింపు పొందుతున్నారు. అంతేకాదు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూనే తమ కుటుంబాన్ని కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తున్నారు.
బీహార్ గౌనహా బ్లాక్‌లోని దోమత్ అనే ఊరులోని థార్ కమ్యూనిటీకి చెందిన మహిళలు..ఇప్పుడు దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామీణ గిరిజన మహిళలు అంటే..కేవలం వంటింటికే పరిమితం కాదని.. కుటుంబాన్ని తాము కూడా ఆర్ధికంగా ఆదుకుంటామని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానిక గిరిజన మహిళలు చేస్తున్న పని.. జిల్లా వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.
నిజానికి దోమత్ పూర్తిగా అడవులతోనే నిండి ఉంటుంది. అక్కడ చదువుకున్నవాళ్లు కూడా ఈ గ్రామంలో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న మహిళలు ఒక సంస్థగా ఏర్పడి అగరబత్తిలు తయారు చేస్తున్నారు. దోమత్ గ్రామంలో మొత్తం 26 మంది మహిళలు.. ఓ గ్రూప్‌గా ఏర్పడి అగరబత్తీలను తయారు చేస్తున్నారు. నెలకు దాదాపు 5వేల అగరబత్తీల బాక్సులు అమ్ముతున్నారు అక్కడి మహిళలు.
వాళ్లు తయారు చేసే ఒక్కో అగరబత్తి బాక్సు ధర 10 రూపాయలకు అమ్ముతున్నట్లు అక్కడి మహిళలు చెబుతున్నారు. ఒక్కో బాక్స్ తయారీకి రూ. 6 వరకు ఖర్చు అవుతుండగా.. బాక్సు మీద 4 రూపాయల లాభం వస్తుందట వారికి. కాకపోతే వీరంతా తగినంత మిషనరీ లేకపోవడంతో..అగరబత్తుల తయారీ చేతితోనే తయారు చేస్తున్నారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్నా సప్లై చేయలేక పోతున్నారు.
అయితే ఈ గిరిజన మహిళలంతా ఇలా ఆర్థికంగా ఎదగడం వెనుక ఓ స్వచ్ఛంద సంస్థ ఉందట. ఈ సంస్థే అగరబత్తీ, దూప్ స్టిక్‌ల తయారీలో గిరిజన మహిళల కమ్యూనిటీ శిక్షణ ఇచ్చారు. ఇక గిరిజన మహిళలు తయారు చేసే ఈ ధూప్ స్టిక్స్ తయారీలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగిస్తారని సంజన తెలిపింది. అగరబత్తీ తయారీకి నాణ్యమైన బొగ్గు, కలప బూడిద , గమ్ పౌడర్ కలుపుతామని ఆ గిరిజన మహిళలు చెబుతున్నారు.
వీరు తయారు చేసే అగరబత్తుల తయారీకి.. ముందుగా బొగ్గు, కలప నుంచి వచ్చే బూడిద, గమ్ పౌడర్‌ను.. తగిన మోతాదులో కలిపి ముద్దలా తయారు చేసుకుంటారు. ఆ తర్వాత దానిని సన్నటి వెదురు పుల్లతో చుట్టి.. దానిపైన బొగ్గు ముద్దను అద్దుతారు. ఇలా చేసిన తర్వాత అగరబత్తీలను మూడు గంటల పాటు నీడలో ఆరబెడతారు. తర్వాత రకరకాల సువాసనలతో కూడిన ద్రవంలో ముంచి.. ఆ తర్వాత మూడు గంటల పాటు అగర బత్తీలను ఎండలో ఆరపెట్టి..ఆ తర్వాత వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.ఇలా బీహార్ రాష్ట్రంలోని.. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన మహిళలు.. స్వయం ఉపాధి పొందుతూ అందరిలో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE