ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు, మెరుగైన నెట్‌వర్క్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత విశ్వసనీయ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన BSNL, కాలక్రమేణా నెట్‌వర్క్ సమస్యలతో వినియోగదారులను కోల్పోయింది. టవర్ కింద కూడా సరిగ్గా సిగ్నల్ రాకపోవడం వల్ల, ప్రజలు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థల వైపు మొగ్గు చూపారు. దీంతో, BSNL మూసివేస్తారనే పుకార్లు కూడా వినిపించాయి.
అయితే, ప్రస్తుతం BSNL తిరిగి పుంజుకుంది! నెట్‌వర్క్ విస్తరణ, ఖర్చుల తగ్గింపు, కస్టమర్-కేంద్రీకృత సేవల్లో మెరుగుదల వంటి వ్యూహాత్మక చర్యలతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది ఏకంగా 2007 తర్వాత BSNL లాభాల్లోకి వచ్చిన మొదటి అవకాశం.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విజయాన్ని “ఒక కీలక మలుపు” గా అభివర్ణించారు. BSNL సేవలు 14-18% వృద్ధి చెందాయని, అంతేకాకుండా 4G సేవలను కూడా ప్రారంభించడం కంపెనీ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా BSNL ఒక ట్వీట్ చేస్తూ, “మీ నమ్మకం, మద్దతుకు ధన్యవాదాలు! మేము ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు సాగుతున్నాం” అంటూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇన్నాళ్లు “BSNL ఇక ముగిసిన కథ” అని అనుకున్నవారందరికీ ఇది సమాధానంగా మారింది. 17 ఏళ్ల నష్టాలను అధిగమించి, లాభాల్లోకి వచ్చిన BSNL ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. త్వరలో 5G సేవలు కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రభుత్వ మద్దతుతో మరింత బలంగా ఎదుగుతుందని, టెలికాం రంగంలో మళ్లీ కీలక పాత్ర పోషించబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.