దేశ రాజధాని హస్తినలో వాయు కాలుష్యం గతంలో ఎన్నడూ లేనంతగా ..మరింత ఆందోళనకరంగా మారింది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు భయంకరంగా వాతావరణమంతా పొల్యూషన్ అయిపోయింది. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ కాలుష్యం అక్కడివారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పొల్యుషన్ కంట్రోల్‌కు.. ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలను మూసివేసి..కేవలం ఆన్‌లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నారు.
తాజాగా గవర్నమెంట్ ఆఫీసుల టైమింగ్స్ విషయంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నుంచి సిబ్బంది వరకూ అంతా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాలి. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే సిబ్బంది మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం అతిశీ తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యతను పెంచడానికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టడం, కూల్చివేతలపై నిషేధాన్ని విధించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరధిలోని స్టోన్ క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు.
గాలి నాణ్యతకు తోడు ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టడంతో.. చాలా ప్రాంతాలలో దృశ్యమానత దారుణంగా పడిపోయింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అయితే విజిబిలిటీ జీరోగా నమోదవడంతో స్థానికులు ప్రతీ రోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పొగమంచు వల్ల రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురవడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.