న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన భయంకరమైన తొక్కిసలాట (Delhi Stampede) దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ సంఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను రైల్వే అధికారులు వెల్లడించగా, వారంతా బీహార్, ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు.
ప్రమాదానికి కారణాలు
మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో పాటు, రైళ్ల ఆలస్యమయ్యే అంశం, కొన్ని రైళ్లు రద్దయినట్లు వచ్చిన పుకార్లు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయనే వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ వార్తలతో రాత్రివేళ ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్ల కోసం వేచిచూస్తున్న వేలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా 14వ ప్లాట్‌ఫాంపైకి పరుగెత్తారు, దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
అప్పటికే భక్తులతో నిండిపోయిన 14వ ప్లాట్‌ఫాం మీద మరో వేలాది మంది చేరుకోవడంతో భారీ గందరగోళం ఏర్పడింది. ప్రయాణికులు తమ సామాన్లు, చిన్న పిల్లలను ఎత్తుకుని పరుగెత్తే క్రమంలో కొందరు స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లపై కిందపడిపోయారు. వారిపై మరికొందరు పడిపోవడంతో కిందపడి ఉన్న వారిని తొక్కుకుంటూ జనాలు ముందుకు సాగారు. కేవలం 15-20 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితికి చేరిన కొందరు ప్రయాణికులు ఊపిరాడక మృతి చెందారు.
విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బట్టలు, బ్యాగులు, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడ జరిగిన తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాధిత కుటుంబాలకు పరిహారం
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇండియన్ రైల్వే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైన వారికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రైల్వే మాట్లాడుతూ, “ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద నిలబడి ఉండగా, ప్లాట్‌ఫామ్ వద్ద చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. 1500 జనరల్ టిక్కెట్లు అమ్ముడవ్వడంతో భారీగా ప్రజలు చేరుకున్నారు. దీంతో జనసమూహం అదుపు తప్పింది,” అని వివరించారు.
ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ట్వీట్‌లో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. “మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ భయంకరమైన తొక్కిసలాట కుంభమేళాకు వెళ్తున్న భక్తుల తాకిడి, అనుకున్నట్లు రైళ్ల అందుబాటులో లేకపోవడం, అకస్మాత్తుగా వచ్చిన గందరగోళం వంటి కారణాల వల్ల చోటుచేసుకుంది. రైల్వే శాఖ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని నిర్ణయించగా, బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.