మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు. కరోనా కేసుల పెరుగుదల వలన లాక్‌డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. లాక్‌డౌన్ కోరుకోవడంలేదని, అయితే మనముందున్న పరిష్కారమేంటని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కు ఎలాంటి ప్రత్యామ్నాయం లభించకపోతే రెండు రోజుల అనంతరం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.
ముంబయిలో రోజూ 500 టెస్ట్ ల్యాబ్ ల్లో 50,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే మహారాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 75,000 నుంచి 1,82,000 వరకు కరోనా పరీక్షలను పెంచమని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 70% ఆర్టీపీసీఆర్ పరీక్షలతో కలిపి రోజుకు 2.50 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ జరిగిందని, గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో రాజీపడటం లేదని, కరోనా కేసులను దాచడం లేదని అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రజలు భావిస్తున్నప్పటికీ, పారదర్శకంగా ఉండడమే దీనికి కారణమని సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు. పరిస్థితుల దృష్ట్యా ప్రజలు భయపడకుండా, కరోనా నియంత్రణ కోసం సహకరించాలని కోరారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 29,04,076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 24,57,494 మంది కరోనా నుంచి కోలుకోగా, 55,379 మంది మరణించారు. ప్రస్తుతం 3,89,832 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ