నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 19 వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా 32 రైతు సంఘాల నాయకులు సోమవారం నాడు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన నిరాహార దీక్షను పాటించనున్నారు. “ఉపవాసం పవిత్రమైనది. మీరు ఎక్కడ ఉన్నా రైతు సోదరుల కోసం ఉపవాసం ఉండండి. వారి పోరాటం విజయవంతం కావాలని దేవునికి ప్రార్థించండి. చివరికి రైతులు ఖచ్చితంగా గెలుస్తారు” అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ తో పాటుగా కీలక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
మరోవైపు రైతుల నిరాహారదీక్షల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇక రైతు సంఘాల నేతలు కూడా సోమవారం సాయంత్రం మరోసారి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ