దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెల చివరికి ఢిల్లీలో దాదాపు 5.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని ఈ రోజు మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆ సమయానికి కరోనా బాధితులకు చికిత్స/వసతి కల్పించడానికి 80,000 పడకలు అవసరమవుతాయని అన్నారు. ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సమూహవ్యాప్తి దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీరును పరిశీలిస్తే జూన్ 15 కు 44,000 కు పైగా, జూన్ చివరకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా పడకల అవసరం ఉంటుందని చెప్పారు.
ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రతపై ఈ రోజు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మనీష్ సిసోడియాతో పాటుగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల్లోని పడకలును ఢిల్లీ ప్రజలకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించలేదని సమావేశం అనంతరం మనీష్ సిసోడియా మీడియాతో చెప్పారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా బాధితులకు చికిత్స అందించాలని లెఫ్టెనెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీలో ఇప్పటికే 29,943 కరోనా కేసులు నమోదవగా, 11,357 మంది కోలుకున్నారు, 874 మంది మరణించారు. ప్రస్తుతం 17,712 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu