అక్టోబర్ 31 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం

Delhi Govt Decides to Close All Schools till October 31

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని పాఠశాలలు అక్టోబర్ 31 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 4, ఆదివారం నాడు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 31 వరకు మూసివేసే ఉంటాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. అయితే ఆన్‌లైన్ తరగతులు మరియు లెర్నింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహణ, ఇతర పాఠశాలల సంబంధిత పనుల కోసం అవసరమైన సిబ్బందిని పాఠశాలకు రమ్మని పిలిచేందుకు ప్రిన్సిపాల్స్ కు అధికారాలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలలో అక్టోబర్ 15 నుంచి కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలల ప్రారంభించేందుకు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అక్టోబర్ 15 నుంచి పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అక్టోబర్ 31 వరకు పాఠశాలల మూసివేతకే నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu