ప్రస్తుతం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు, ఇతర అధికారుల పేరుతో మోసాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా, ముంబైకు చెందిన ఓ యువతి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో ఘోరంగా మోసపోయిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తోంది. నవంబర్ 19న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘తాము ఢిల్లీ పోలీసులమని’’ పరిచయం చేసుకుని, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు కూడా ఉందని తెలిపారు. ఈ సమాచారం విని యువతి భయంతో గజగజలాడింది.
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం
నేరగాళ్లు ఆమె భయాన్ని ఆసరాగా తీసుకుని అసలు మోసానికి దిగారు. మామూలు కాల్ తర్వాత వీడియో కాల్ చేస్తూ, విచారణ పూర్తయ్యే వరకూ ‘‘డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’’ అని నమ్మించారు. ధృవీకరణ కోసం బ్యాంక్ వివరాలు తీసుకుని, ఆమెను రూ.1,78,000లు బదిలీ చేయించారు.
హోటల్ గదిలో బలవంతం
దీంతో ఆ యువతి వారికి బలయ్యింది. ఆపై విచారణ కోసం హోటల్ గదిలో ఉండాలని చెప్పి వీడియో కాల్ చేశారు. కానీ అక్కడే అసలు మోసం మరో దశకు వెళ్లింది. ‘‘బాడీ వెరిఫికేషన్’’ కోసం బట్టలు విప్పాలని బలవంతం చేయడంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల హెచ్చరిక
పోలీసులు ఈ కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నరేష్ గోయల్ కేసులో ఒక టెక్స్‌టైల్ దిగ్గజం వద్ద కూడా సైబర్ నేరగాళ్లు రూ.7 కోట్ల వరకు మోసం చేసినట్లు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ లేదా వర్చువల్ అరెస్ట్ అన్నది ఎక్కడా లేనిదని, ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలు చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.