దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. బీహార్ లోను.. వరుస ప్రకంపనలతో భయాందోళనలో ప్రజలు 

Early Morning Tremors Panic Strikes Delhi NCR As Earthquake Hits

ఈరోజు ఉదయం 5.36 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలోనే 5 కిలోమీటర్ల లోతులో ఉండటం గమనార్హం.

దిల్లీ భూకంపం అనంతరం కొద్ది గంటలకే బీహార్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 8:02 గంటలకు బీహార్‌లోని సివాన్‌లో భూకంపం నమోదైంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయింది. సివాన్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. జనవరి 23న చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో సంభవించిన 7.2 తీవ్రత భూకంప ప్రభావం ఢిల్లీలో కూడా కనిపించింది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలకు దారితీసింది. ఢిల్లీ భూకంపం జోన్-4 పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ ఉదయం సంభవించిన భూకంపంతో అపార్ట్‌మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించినట్లు ప్రజలు తెలిపారు. భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లుగా అనిపించడంతో భయాందోళన పెరిగింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ స్పందన

భూకంపం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారని, మరోసారి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

భారత భూకంప పరిశోధన సంస్థలు తాజా భూకంపాలపై సమగ్ర పరిశీలన చేస్తున్నాయి. ఢిల్లీలో భూకంప తీవ్రత పెరగడం, భూమిలో లోతైన మార్పులు సంభవించడం గమనార్హం. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకంపనలకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.