కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో “కిసాన్ గణతంత్ర పరేడ్” చేపడుతున్నారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు పరేడ్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సింఘు, టిక్రీ సరిహద్దుల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలోని బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నం చేస్తుండడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
సింఘు సరిహద్దు నుండి ఢిల్లీ సంజయ్ గాంధీ టాన్స్ పోర్ట్ నగర్ వద్దకు వచ్చిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. మరోవైపు ఢిల్లీ ఐటీవో సెంటర్, ప్రగతి మైదాన్ వద్ద కూడా రైతులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కొందరు రైతులు ట్రాక్టర్లతో ఎర్రకోట వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త నెలకుంది. అలాగే రైతుల ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీలోని అనేక మెట్రో రైలు స్టేషన్లను కూడా మూసివేశారు.
రైతుల ట్రాక్టర్ పరేడ్ కు అన్ని విధాలా సహకరిస్తున్నామని అయితే వారికీ అనుమతించిన మార్గాల్లోనే పరేడ్ నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ పరేడ్ కు ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతివ్వగా, పంజాబ్, హర్యానా, యూపీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఓవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు, మరోవైపు రైతుల ట్రాక్టర్ పరేడ్ ఉండడంతో ఢిల్లీ వ్యాప్తంగా భారీ భధ్రతా ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ