ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మన దేశంలోకి అడుగుపెట్టింది. భారత్‌లో మొదటి ఎంపాక్స్ కేసు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల మంకీపాక్స్ వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. గతంలో భారత్‌లో నమోదైన మంకీపాక్స్ వైరస్ వేరియంట్ కంటే ఈసారి సోకిన వేరియంట్ అంత ప్రమాదకరం కాదని.. దీంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న ప్రమాదకర మంకీపాక్స్ వేరియంట్ కాదని స్పష్టం చేసింది. మంకీపాక్స్ వేగంగా ప్రబలుతున్న ఓ దేశం నుంచి భారత్‌కు వచ్చిన ఒక వ్యక్తిలో ఆ వ్యాధి లక్షణాలను గుర్తించారు. ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించినట్టు పేర్కొంది. నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
దీంతో అతడిని ఐసోలేట్ చేసి, ఓ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, బహుళ అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కాగా రోగి పేరును కేంద్రం వెల్లడించలేదు. 2022 సంవత్సరం జులై నుంచి ఇప్పటివరకు భారత్‌లో నిర్ధారణ అయిన 30 మంకీపాక్స్ కేసుల తరహా వేరియంట్ వల్లే సదరు వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడైంది. డబ్ల్యూహెచ్ఓ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణమైన వేరియంట్ వల్ల అతడికి మంకీపాక్స్ సోకలేదని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది.
మరోవైపు మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. పాకిస్థాన్‌లోనూ నాలుగు అనుమానిత కేసులు నమోదయ్యాయి. సౌదీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. స్వీడన్‌లో కూడా ఇప్పటికే వైరస్ బయటపడింది. తాజాగా ఫిలిప్పీన్స్‌లోనూ వైరస్ నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, ల్యాండ్ పోర్టుల్లోని అధికారులు.. ఎంపాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నట్లు సమాచారం.