భారతీయ రైల్వే వివిధ కేటగిరిల్లో ప్రయాణించేవారి కోసం అనేక రాయితీలు ప్రకటిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు, సైనికులకు.. ఇలా వివిధ రంగాల్లోనివారికి టికెట్లలో రాయితీని ఇస్తుంటుంది. కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తరువాత ఆ రాయితీని రైల్వేలు ఎత్తేశాయి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రైల్వేకు ఆదాయమే ప్రధానంగా మారిందని, ప్రజా సంక్షేమం పట్టడంలేదంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. తాజాగా ఈ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తీసుకురాబోతోంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్ల రాయితీ సదుపాయాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నహకాలు చేస్తుంది. ఇది జరిగితే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన ఈ ముఖ్యమైన టికెట్ రాయితీని ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే, ప్రధాని మోదీ హయాంలో సీనియర్ సిటిజన్‌లకు ఇదే అతిపెద్ద బహుమతి అవుతుంది.
ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ, కరోనా కాలం తరువాత రైలులో సీనియర్ సిటిజన్ల ప్రయాణం పెరిగింది. దిగువ సభలో ఒక ప్రశ్నకు రాత పూర్వక సమాధానం ఇస్తూ, రైల్వే మంత్రి 20 మార్చి 2020 నుండి 31 మార్చి 2021 వరకు 1.87 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించారని చెప్పారు. కాగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదుకోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లల్లో ప్రయాణించారు. వారికి ఆ సమయంలో రాయితీనిచ్చేందుకు రైల్వే నిరాకరించింది. అయితే ప్రస్తుతం వీరికి రాయితీని వర్తింపచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏసీ కోచ్ లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వకుండా స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారికి మాత్రమే రాయితీని వర్తింప చేయనున్నారు. జనరల్ టికెట్లపై కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడోసారి బాధ్యతలు స్వీకరించేంతవరకు, స్వీకరించిన తర్వాత కూడా ఆయన రైల్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలో భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీనికి కారణం. భారతీయ రైల్వేను మరింతగా అభివృద్ధి పరిచి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే వందేభారత్ రైళ్లను తీసుకురాగా, ఈ ఏడాది చివరకు హైడ్రోజన్ రైళ్లు, వచ్చే ఏడాది బుల్లెట్ రైలును పట్టాలెక్కించబోతున్నారు.