దేశంలో కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం నాడు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా బాధితులకు అందించే చికిత్సల జాబితా (క్లినికల్ ప్రోటోకాల్) నుండి ప్లాస్మా థెరపీని తొలగించారు. ప్లాస్మా థెరపీ వలన ప్రభావం లేదని, అలాగే అనేక కేసుల్లో అనుచితంగా ఉపయోగించబడుతుందని అధ్యయనాల్లో తేలడంతో ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల చికిత్సలో స్వల్ప, మధ్యస్థ, తీవ్ర లక్షణాలను బట్టి అనుసరించాల్సిన చికిత్స విధానాన్ని ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్దిష్ట పరిస్థితులు నేపథ్యంలో కరోనా బాధితుల చికిత్సలో రెమ్‌డెసివిర్, టొసిలిజుమాబ్ ఇంజెక్షన్లను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారు.
ముందుగా గత ఏడాది ఏప్రిల్ లో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కరోనా వ్యాధి నుంచి అప్పటికే కోలుకుని యాంటీబాడీలు అభివృద్ధి చెందిన వారి నుంచి ప్లాస్మా సేకరించి, కరోనా సోకిన వారికి వ్యాధి తీవ్రతను బట్టి ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. దేశంలో వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు ఎక్కువగా ప్లాస్మా థెరపీని సూచిస్తున్నారు. అయితే ప్లాస్మా థెరపీ వలన ప్రయోజనం లేదని, ప్లాస్మా థెరపీని అహేతుకంగా, అశాస్త్రీయంగా ఉపయోగించడం వలన కొత్త వైరస్ వేరియంట్స్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు/ప్రజారోగ్య నిపుణులు/వైద్యులు ఐసీఎంఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కోవిడ్-19 నేషనల్ టాస్క్‌ఫోర్స్, ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల బృందం ప్లాస్మా థెరపీపై కీలకంగా చర్చించి కరోనా చికిత్సల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ