భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల ఛార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నూతన ధరలు డిసెంబర్ 26, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలోని స్లీపర్ క్లాస్ మరియు ఏసీ (AC) కోచ్‌ల టికెట్ ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయడం మరియు అత్యాధునిక కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ ధరల పెంపును చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రైల్వే శాఖకు ఏటా అదనంగా సుమారు రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే టికెట్ల పెంపుద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ‘కవచ్’ వంటి అత్యాధునిక సాంకేతికతను దేశవ్యాప్తంగా విస్తరించడానికి వెచ్చించేందుకు రైల్వే శాఖ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
రైలు ప్రయాణీకులపై ఈ నిర్ణయం కొంత భారం వేసినప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన సౌకర్యాలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రయాణీకుల రక్షణ మరియు వేగవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీస పెంపు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఊరటగా సబ్‌ర్బన్, ప్యాసింజర్ రైళ్లు, జనరల్ క్లాస్ టికెట్ల ధరలను యథాతథంగా కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు అందించే రాయితీల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు.
టికెట్ ధరల పెంపుతో పాటు రైళ్ల సమయపాలన మెరుగుదల, శుభ్రత ప్రమాణాల పెంపు, స్టేషన్ల ఆధునీకరణ, డిజిటల్ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవలను మరింత మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ పేర్కొంది.






































