అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగుపెట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తీర్పు చెప్పనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ వారి వారి కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మొదలవుతుంది.
అమెరికాలో నేడు జరిగేవి 60వ అధ్యక్ష ఎన్నికలు. దేశంలో మొత్తం 230 మిలియన్ల మంది ఓటర్లు ఉండగా అందులో 160 మిలియన్ల మంది (సుమారు 16 కోట్లు) మాత్రమే ఈసారి ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నారు. ఇక 70 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు లేదా ముందస్తు పోలింగ్ స్టేషన్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మన మాదిరిగా కాకుండా అమెరికాలో ఓటింగ్ మొదలైన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రారంభమవుతాయి. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. చిన్న రాష్ట్రాలలో ముందుగానే ఫలితాలు వెలువడతాయి. ఇక కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి కొంత సమయం పడుతంది.
ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా 200కుపైగా భాషలు మాట్లాడే న్యూయార్క్‌లో ఇంగ్లిష్‌తోపాటు మరో ఐదు భాషల్లో బ్యాలెట్లను ముంద్రించారు. అందులో ఒక భారతీయ భాష కూడా ఉంది. అదే బెంగాలి. మన జాతీయ భాష అయిన హిందీ అయినప్పటికి భారత్- బంగ్లాదేశ్ నుంచి వెళ్లి న్యూయార్క్‌లో నివాసముంటున్న బెంగాలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 1965 ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం దక్షిణాసియా మైనారిటీ సమూహాలకు భాషా సహాయం తప్పనిసరని ఫెడరల్ ఆదేశాల నేపథ్యంలో 2013లో క్వీన్స్‌లో బెంగాలీని చేర్చారు.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిత్యవసరాల ధరలు, జీవన వ్యయాలు, భవిష్యత్తు ఆర్థిక భద్రత వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ నాలుగు సంవత్సరాల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఇంటి ఖర్చలు, గృహోపకరణాలు, బీమా వంటి సేవల ధరలు 10-40 శాతం మధ్య పెరిగాయి. పెట్రోల్ ధరలు మరింత ఎక్కువ పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ అక్కడివారు ఏమాత్రం సంతోషంగా లేరు. ఈ అంశమే ట్రంప్‌కు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి ఎవరు బెస్ట్ అని అడిగితే.. అత్యధికులు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కే ఓటు వేస్తున్నారు. ఇక స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌ను కోరుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇక ఇమ్మిగ్రేషన్ కూడా అతిపెద్ద సమస్యగా ఉంది. ట్రంప్ మొదటిసారి పాలనలో కనికరం లేకుండా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్వహించారు. మెక్సికోతో సరిహద్దు నియంత్రణలో లేదని, ఈ ప్రభావంతో నేరాలు, దోపిడీలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోడ నిర్మాణానికి ప్రతిపాదన కూడా చేశారు. ఇక తాను మరోసారి అధికారంలోకి ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత కఠినతరం చేస్తానంటూ ఆయన హామీలు ఇస్తున్న విషయం తెలిసిందే. మరి ఈసారి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.