నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్‌-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి

IPL 2020 Qualifier 1: Match Between Mumbai Indians and Delhi Capitals Today

యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ చోటుదక్కించుకున్నాయి. కాగా ప్లే ఆప్స్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరుకునేందుకు ఇరుజట్లు అన్ని అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబయి నెగ్గితే ఐపీఎల్ లీగ్ లో ఆరోసారి ఫైనల్ చేరిన జట్టుగా గుర్తింపు పొందనుంది. గతంలో ఐదుసార్లు ఫైనల్‌ చేరిన ముంబయి నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో నెగ్గి, తొలిసారిగా ఐపీఎల్ లో ఫైనల్ చేరేందుకు ఉవ్విళూరుతుంది.

అయితే సీజన్ ప్రారంభం నుంచి ముంబయి జట్టు తిరుగులేని ఆధిపత్యం చూపిస్తుండడంతో, ఢిల్లీతో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబయి జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్‌ పాండ్య, కీరన్ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా బ్యాటింగ్ లో రాణిస్తుండగా, బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, చాహర్ బౌలింగ్ లో రాణిస్తుండడంతో గొప్ప విజయాలు సాధిస్తూ వస్తుంది. ‌ఇక ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ గెలవాలంటే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌,‌ పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ సామర్ధ్యం మేర రాణించాల్సి ఉంటుంది. మరోవైపు కగిసో రబాడ, ఎన్రిచ్‌ నోర్జే, అశ్విన్, అక్సర్ పటేల్ లాంటి బౌలర్లు తో ఢిల్లీ జట్టు బలంగా ఉంది. క్వాలిఫయర్‌-1 లో గెలిచి ఐపీఎల్-2020 ఫైనల్ చేరే జట్టు ఏదో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక క్వాలిఫయర్‌-1 లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. క్వాలిఫయర్‌-2లో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడి గెలిచి ఫైనల్ కు చేరొచ్చు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ