జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన 2021 ఏప్రిల్ 23 వరకు పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు మాజీ సీజే రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారమానంతరం వారంతా జస్టిస్ బాబ్డేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ రంజన్ గొగోయ్ తన తరువాత అనుభవజ్ఞుడు, సీనియర్ అయిన జస్టిస్ బాబ్డేను పేరును తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాసారు. ప్రతిపాదనను పరిశీలించిన న్యాయశాఖ కార్యాలయం, నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించారు. ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్రపతికి చేరగా ఆయన ఆమోదించడంతో చీఫ్ జస్టిస్ గా జస్టిస్ బాబ్డేను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే 1956 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీలో బీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తిచేశారు. 1978వ సంవత్సరంలో మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో 21 సంవత్సరాలపాటు న్యాయవాదిగా పనిచేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు, అలాగే 2012 అక్టోబర్ 16 నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. పదోన్నతితో 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా నియమించబడ్డారు. ఇంతకాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17, ఆదివారం నాడు రిటైర్ కావడంతో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
[subscribe]



