అగ్రరాజ్యం అమెరికాను సింథటిక్ డ్రగ్ అనే సమస్య పట్టి పీడిస్తోంది. సరిగ్గా కరోనా మహమ్మారిలాగే రోజుకు వందల మంది ప్రాణాలను తీస్తూ అమెరికాను అంతర్లీనంగా నాశనం చేస్తోంది. దీని దాటికి బలైపోతున్నవారిలో మెజారిటీగా యువత, మద్య వయస్కులవారే ఉన్నారని అక్కడి డాక్టర్లు అంటున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై డ్రాగన్ కంట్రీ చైనాను అనుమానిస్తున్నామని చెబుతున్నారు.
ఇటీవల అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ గణాంకాలను విడుదల చేసింది.అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న డ్రగ్ పేరు ఫెంటనిల్. ఒక పెయిన్ కిల్లరే అయినా ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పని చేస్తుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరాయిన్ కంటే సుమారు 50 రెట్లు పవర్ ఫుల్ అని హెచ్చరిస్తున్నారు. ఈ డ్రగ్ రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమైనదని ఎందుకంటే.. దీన్ని మాదకద్రవ్యాలతో కలిపి వాడుతున్నారని అక్కడి పరిశోధకులు ఆరోపిస్తున్నారు.
మరికొంతమంది తప్పుడు ప్రిస్క్రిప్షన్స్‌తో మెడికల్ షాపుల్లో కొంటున్నట్లు గుర్తించినట్లు అధికారులు అంటున్నారు. మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్స్ చేతిలో ఈ డ్రగ్ పడటం వల్ల ఈ స్థాయిలో విచ్చలవిడిగా అమ్మకాలు, వినియోగం ఎక్కువ అయిపోయిందని చెబుతున్నారు. చైనాలో దీన్ని చౌకగా తయారు చేసి.. వివిధ మార్గాల్లో అమెరికాకు తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పెయిన్ కిల్లర్ గా ఉపయోగించే ఈ ఫెంటనిలను ఆస్పత్రుల బయట ఎవరూ వినియోగించేవారు కాదు. అయితే… ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ ఈ పెయిన్ కిల్లర్ ను విచ్చలవిడిగా వాడుతున్నారని అంటున్నారు. అమెరికా సీడీసీ 2022లో ఫెంటనిల్ అధిక డోస్ వల్ల ఇప్పటి వరకూ 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అంటే.. సగటున రోజుకు 295 మంది ఇది వాడుతూ చనిపోతున్నట్లు తేల్చింది. తర్వాత తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు.
మరోవైపు దీనిపై స్పందించిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్… గత రెండేళ్లలోనే సుమారు 50,000 పౌన్ల కంటే ఎక్కువ పెంటనిల్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. సుమారు 20 లక్షల మంది ప్రాణాలు తీయగలగినంత డ్రగ్ అన్న మాట. ఎక్కడికక్కడి చర్యలు తీసుకుంటున్నా దీని వాడకం తగ్గడం లేదని అధికారులు చెబుతున్నారు.