సీఎంల ఎంపికలో మోదీ, అమిత్ షాల స్ట్రాటజీ ..

Modi And Amit Shahs Strategy In Selecting CMs

12రోజుల ఉత్కంఠకు తెరదించుతూ న్యూఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. దీంతో రేఖాగుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. సీఎం సీటును జాక్ పాట్ గా కొట్టేశారన్న చర్చ సాగుతోంది. ఆమె షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజక వర్గ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి హస్తిన ఖుర్చీని సొంతం చేసుకున్నారు. దీంతో బీజేపీ 27ఏళ్ల కలను సాకారం చేసుకున్నట్లు అయింది.

నిజానికి బీజేపీలో సీఎంల ఎంపిక మొదటి నుంచీ కూడా సాఫీగానే కొనసాగుతూ ఉంటుందన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఎంత మంది సీనియర్లు సీఎం సీటు కోసం పోటీ పడినా కూడా వారందరినీ కూల్ చేసి..మోదీ, అమిత్ షా ఎవరికి సీఎం పదవి అప్పగించాలని అనుకుంటారో వారికే కూల్ గా అప్పగిస్తారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయి రేఖా గుప్తాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఢిల్లీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖాను సీఎంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనించాయి.

చాలా మంది సీనియర్ నేతలను కాదని బీజేపీ అధిష్టానం.. రేఖా గుప్తాకు అంత ప్రియారిటీ ఎందుకు ఇచ్చిందో అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎమ్మెల్యేగా కూడా రాజకీయ అనుభవం లేని మహిళను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడంలో బీజేపీ హైకమాండ్ ప్లాన్ ఏంటంటూ బిగ్ డిబేట్లు జరిగాయి. నిజానికి ఢిల్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచినప్పటి నుంచి ఢిల్లీ సీఎం రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ బీజేపీ మొదటి నుంచే మహిళనే సీఎం చేయాలని భావిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి.

మహిళా సీఎం రేసులో బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ, రేఖా గుప్తా పేర్లు తెరమీదకు వచ్చాయి. మరోవైపు కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు సుష్మస్వరాజ్ కూతురు కూడా గట్టిగా పోటీ పడ్డారు. కానీ వారందరినీ కాదని రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. డిల్లీ కంటే ముందు మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఊహించని పేర్లనే మోదీ, అమిత్ షా ప్రకటించారు.

మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను సీఎం చేశారు. చౌహాన్ కు మధ్యప్రదేశ్ లో భారీ క్రేజ్ ఉన్నా సరే ఆయనను కేంద్రానికే పరిమితం చేసి కొత్త నాయకత్వానికి అవకాశమిచ్చారు. రాజస్థాన్ లో వసుంధర రాజే వంటి వారు గట్టిగా ఒత్తిడి తెచ్చినా కూడా భజన్ లాల్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా చేసి.. డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఏ మాత్రం సంకోచించకపోవడమనే ఒక్క కారణంతోనే దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేశారు. అలాగే హర్యానాలో కూడా నాయబ్ సింగ్ సైనీకి అవకాశాన్ని కల్పించారు.

మోదీ, అమిత్ షాల వెనుక ఈ సెలక్షన్ పద్ధతిలో.. పార్టీ బలోపేతం అవ్వాలి తప్ప పార్టీలోని నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ పెరగకూడదన్న కారణం ఉందనే స్ట్రాటజీ ఉందన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రులంతా ఓ రకంగా పాపులారిటీ లేని వారే. ఒక్క యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ప్రస్తుతం ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు.