దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. మోదీ నామినేషన్ ను ఇద్దరు ఓబీసీలు, ఒక దళితుడు, ఒక జ్యోతిష్యుడు బలపరిచారు. పండితులు నిర్ణయించిన పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి ఈ నామినేషన్ దాఖలు చేశారు. సుముహూర్తం ప్రకారం.. మంగళవారం ఉదయం 11:40 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్ లో వచ్చిన మోదీ.. కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
ఆయనతో పాటు నాలుగు కులాలకు చెందిన సామాన్యులు కూడా ఉన్నారు. వారే మోదీ నామినేషన్‌ను ప్రతిపాదించారు. ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి నామినేషన్ పత్రాలపై తొలి సంతకం చేశారు. మిగతా ముగ్గురు మోదీ నామినేషన్‌ను బలపరిచారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణపత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. వారణాసి నుంచి 2014లో పోటీకి దిగిన మోదీ.. 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు. 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్ వాదీ అభ్యర్థి మాలినీ యాదవ్ పై గెలుపొందారు. ఈసారి కూడా భారీ ఆధిక్యంపైనే కన్నేసిన మోదీ.. మూడోసారి పోటీకి నామినేషన్ వేశారు. ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.
నామినేషన్‌కు దాఖలుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్టు చేశారు. ఒకప్పుడు కాశీగా భాసిల్లిన వారణాసి నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో అంతకంత పెరుగుతూ వచ్చిందని భావోద్వేగంతో పేర్కొన్నారు. గంగమ్మే నను పిలిచింది వారణాసి ప్రాంతంలో నిర్వహించిన రోడ్ షోలు, ఆధ్యాత్మిక పర్యటనలు తనకు ఈ నగరంతో అనుబంధాన్ని పెంచాయని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఆహ్వానించిందా అని అనిపించింది. పదేళ్ల తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుంది. ఇన్నేళ్లలో కాశీతో నా బంధం దృఢమైంది. ఇప్పుడీ నేల నాది. తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. నామినేషన్‌కు ముందు ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో మోదీ నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY