ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. దీంతో మరోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే ఇప్పటి వరకు వరుసగా మూడుసార్లు ప్రధానిగా కొనసాగగా.. ఇప్పుడు అదే వరుసలో మోడీ చేరారు.
ఇకపోతే ప్రమాణం చేసిన 71 మందిలో 30 మందికి క్యాబినెట్ హోదా.. 36 మందికి సహాయ మంత్రి హోదా.. ఐదుగురికి స్వతంత్ర హోదా ఉంటుంది. తెలంగాణ నుంచి పార్టీలో సీనియర్ లీడర్లు అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. అలాగే ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కింది. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి వరించింది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు, బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు సహాయ మంత్రిపదవులు దక్కాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయిదేళ్ల తర్వాత తిరిగి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్‌సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న భాజపా నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్‌లకు మంత్రి పదవులు లభించాయి. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్‌లను మంత్రి పదవి వరించింది.
ప్రమాణస్వీకారోత్సవానికి ఏడు దేశాల అధిపతులు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలతో కలిపి మొత్తం 9 వేల మంది అతిథితులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బీహార్ సీఎం నితీశ్ కుమార్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దామీ, సినీనటులు షారుక్ ఖాన్, రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY