జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఐదుగురిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఎన్‌సీతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వంలో చేరడం లేదని, బయట నుంచి మద్దతిస్తామని తెలిపింది. ఉప ముఖ్యమంత్రిగా జమ్మూకు చెందిన సురిందర్ చౌధరి, మరో నలుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వీఐపీల రాకపోకల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని జమ్మూకశ్మీర్ డీజీపీతో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. లాఠీలు ఝళిపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయవద్దని ఆదేశాలిచ్చాను. మన ప్రవర్తన పీపీల్స్-ఫ్రెండ్రీగా ఉండాలని నా మంత్రివర్గ సహచరులకు కూడా సూచించాను. ప్రజాసేవ కోసమే పదవుల్లో ఉన్నాం, వారికి అసౌకర్యం కలిగించడానికి కాదని చెప్పాను” అని ఒమర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మెజార్టీకి కావాల్సిన సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌తో నేషనల్ కాన్ఫరెన్స్ జత కట్టింది. ప్రస్తుతం, 90 స్థానాల జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి 54 ఎమ్మెల్యేల మద్దతు ఉంది, బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో శాసన సభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరాయి. దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఎల్జీ ఆహ్వానించారు. తాజాగా, జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం సోమవారం గెజిట్ విడుదల చేసింది, దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
2018లో బీజేపీ మరియు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది, తదుపరి శాసన సభను రద్దు చేసి ఆరు నెలల పాటు గవర్నర్ పాలన నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో, ప్రధాని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఎన్నికల్లో గెలిచి మెజార్టీ సీట్లు సాధించడంతో ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, భద్రతాపరమైన కారణాల వల్ల అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. అందుకుగానూ, 2019 అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.