వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల ముసాయిదా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వన్ నేషన్ , వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇదివరకే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది . దీనిపై తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశ పెట్టబోతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్ని సభలో టేబుల్ చేయడానికి లైన్ క్లియర్ అయింది.
ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది.
అయితే బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి నివేదిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చడం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఏకాభిప్రాయ సాధన తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే అధికార, విపక్ష సభ్యులతో జేపీసీని వేయనుంది. జేపీసీ ఏర్పాటయితే దాని ద్వారా అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, సామాన్యుల అభిప్రాయాలను కూడా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.
అయితే జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న విషయంపై చర్చ జరుగుతోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు.. అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. జమిలి ఎన్నికలు.. అంటే.. వన్‌నేషన్, వన్ ఎలక్షన్. దేశానికి ఒక్కసారే ఎన్నికలు.. మిగిలిన ఐదేళ్లూ పరిపాలనపై దృష్టిపెట్టాలన్న దృక్పధంతో జమిలిని తెరపైకి తీసుకొచ్చారు.